ప్రభుత్వ ఉపాధ్యాయులకు జూన్ 2వ తేదీన పీఆర్సీ ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకటేష్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఎస్ యుటిఎఫ్ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే పీఆర్సీని, పెండింగ్ డీఏలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయలేదని ఆదిమూలం వెంకటేష్ అన్నారు. వెంటనే జూన్ 2వ తేదీన పీఆర్సీ ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులందరికీ నగదు రహిత ఆరోగ్య కార్డులు అందించాలని, సీపీఎస్, జీపీఎఫ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆకునూరి మురళి కమిషన్ లోని లోటుపాట్లను సరిచేసి, సూచించిన అంశాలను పరిశీలించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విస్తృత స్థాయి సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు దాసరి శంకర్, ఉపాధ్యక్షులు ఆకుల రాజేశ్వర్, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.












