జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం ఓపెన్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షలు ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రెండు పూటలా జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
పదో తరగతికి 1035 మంది, ఇంటర్మీడియట్కు 821 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, మొత్తం 1856 మంది విద్యార్థులు 9 పరీక్షా కేంద్రాలలో (5 ఎస్.ఎస్.సి, 4 ఇంటర్) పరీక్షలు రాయనున్నారని ఆయన వివరించారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనువుగా ఫర్నిచర్, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు, వైద్య సిబ్బందితో కూడిన అత్యవసర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు, ఓ.ఆర్.ఎస్. పొట్లాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. దూర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైతే ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు.
ఈ సమావేశంలో డి.ఇ.ఓ. భోజన్న, డి.ఐ.ఇ.ఓ. పరుశురాం, తపాలా శాఖ ఇన్స్పెక్టర్, ఎ.సి.జి.ఇ. పరమేశ్వర్, ఆర్టీసీ, వైద్య శాఖల అధికారులు రమేష్, సౌమ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












