ముధోల్ మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ యువతి ఆకుల నవ్యశ్రీ గౌడ్, శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థుల 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఫీజును చెల్లించి, వారి విద్యాభ్యాసానికి అండగా నిలిచారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నవ్యశ్రీ గౌడ్, విద్యాదానమే మహాదానమని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి పూర్తి ఫీజును చెల్లించేందుకు ప్రతి సంవత్సరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. తాను కూడా పేదరికం నుంచి కష్టపడి చదువుకొని ఉన్నత ఉద్యోగం సాధించినట్లు ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ విద్యా సంవత్సరానికి గాను ఠాకూర్ నవ్యశ్రీ (తండ్రి రాజు సింగ్), వరుణ్ తేజ్ గౌడ్ (తండ్రి బాలాజీ) అనే ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశారు. వారిద్దరి మొత్తం వార్షిక ఫీజు రూ.32,400 ను నవ్యశ్రీ గౌడ్ చెల్లించారు. ఈ సహాయం విద్యార్థుల విద్యాభ్యాసం నిరంతరాయంగా కొనసాగడానికి దోహదపడుతుంది.
తన అమ్మమ్మ కీ.శే. ముష్కం వినోద, తాతయ్య కీ.శే. ఆకుల సత్యనారాయణ గౌడ్ జ్ఞాపకార్థం ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు నవ్యశ్రీ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆమెతో ఫోన్లో మాట్లాడి, ఆమె దాతృత్వాన్ని అభినందించారు.
నవ్యశ్రీ గౌడ్ చేసిన సహాయానికి, ఆమెను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు పాఠశాల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయని వారు కొనియాడారు.











