యాద్గార్ పల్లి గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి ప్రభుత్వ పాఠశాలను మిర్యాలగూడ టౌన్ ప్రెసిడెంట్ గాయం ఉపేందర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించిందని ఉపాధ్యాయులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పాఠశాల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా అండగా ఉంటానని, ప్రభుత్వ పరంగా అవసరమైన సౌకర్యాల కోసం ఎమ్మెల్యే బిఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లి పనులు జరిగేలా కృషి చేస్తానని సర్పంచ్ ఉపాధ్యాయులతో సమావేశమై హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ హమాలీ యూనియన్ అధ్యక్షులు నక్క నాగేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.












