నిజామాబాద్, 2026-06-05
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. పాలనలో పారదర్శకతను పెంచేందుకు ఈ కెమెరాల ఏర్పాటు అత్యవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని చాలా విద్యాశాఖ కార్యాలయాల్లో కెమెరాలు ఉన్నా, నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇంకా ఏర్పాటు చేయలేదని ఆయన ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. పాలనలో పారదర్శకతను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పలు సందర్భాల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీని నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని విద్యాశాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఏర్పాటులో జాప్యం
అయితే, నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మాత్రం నేటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇటీవల డీఈవో తన చాంబర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు జారీ అయినప్పటికీ, కొంతమంది ఉద్యోగులు డీఈవోకు విజ్ఞప్తి చేయడంతో, వారి ఒత్తిడికి తలొగ్గి కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటును వాయిదా వేశారు.
ఉద్యోగుల అభ్యంతరాలకు కారణాలు
సమయానికి ఫేషియల్ అటెండెన్స్ వేసుకుని బయటకు వెళ్లి తమ సొంత పనులు చేసుకోవడానికి, సమయపాలన పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు కార్యాలయానికి వచ్చి వెళ్లడానికి వీలుండదని, అలాగే ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, ఉపాధ్యాయుల ఎన్ఓసీలు, మెడికల్ బిల్లులు, డిప్యూటేషన్లు, ఇంక్రిమెంట్లు, ఎస్ఎస్సీ పరీక్ష విధులు, కారుణ్య నియామకాలు, ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు వంటి పలు అంశాలపై కార్యాలయానికి వచ్చే వారితో జరిపే సంప్రదింపులు కెమెరాల్లో రికార్డు అయితే అధికారులకు తెలుస్తాయనే భయంతో కొంతమంది సిబ్బంది ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
డిమాండ్ చేసిన పిఆర్టియు
ఈ కారణాల వల్ల కొంతమంది సిబ్బంది నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేయడంతో, కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదని సమాచారం. కావున, పాలనలో పారదర్శకతను పెంచేందుకు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తక్షణమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా పక్షాన గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.












