నీట్ పరీక్ష లీకేజీ, కాక్రోచ్ ఉద్యమం, యువత ఆగ్రహం, విద్యామంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జంతర్‌మంతర్ కేంద్రంగా జరిగిన విద్యార్థుల పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నించిన మోడీ సర్కార్, అసమర్థ పాలనతో దేశవ్యాప్తంగా అభాసుపాలైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇప్పుడు యువజన ఉద్యమంలో కీలకపాత్ర ఎవరిదన్న కోణంలో కేంద్రం వేట మొదలుపెట్టింది. నీట్ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహాన్ని ఎదుర్కోలేక, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగడం కేంద్ర ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో ఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలోకి పోలీసు యంత్రాంగం అక్రమంగా చొరబడి, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి, జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. ఢిల్లీ ఉద్యమానికి సంబంధించి విద్యార్థులు, యువతపై కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఐదేళ్ల నాటి కేసును తిరగదోడి, నాన్-బెయిలబుల్ వారెంట్‌ను చూపి ఐషీని అరెస్టు చేసి తీహార్ జైళ్లో నిర్భందించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. విద్యా వ్యవస్థలో జరిగిన అక్రమాలను ప్రశ్నించడం, పేపర్ లీక్ చేసిన వారిని వదిలేసి, లీకేజీని వ్యతిరేకించిన విద్యార్థులను నిర్భందించాలనుకోవడం కేంద్రం కక్షపూరిత ధోరణిని తెలియజేస్తోందని విమర్శకులు అంటున్నారు.
నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. పరీక్షల విశ్వసనీయత దెబ్బతింది. నిరాశ నిస్పృహలకు లోనై కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జవాబుదారితనం కొరవడింది. పరీక్షా నిర్వహణ సంస్థ తీరు అసంతృప్తిని రగిల్చింది. ప్రధాని మౌనవ్రతమే జవాబైంది. బాధ్యత వహించాల్సిన మంత్రి రాజీనామా చేయడానికి ససేమిరా అనడంతో దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసనబాట పట్టాయి. కాక్రోచ్ ఉద్యమం కూడా ఈ ఆవేదనకు ప్రతీకగా నిలిచింది. అయితే, ఇప్పుడు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పాలకులు, వారినే నిందితులుగా చిత్రీకరించే పనిలో పడటం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఒక చారిత్రక వారసత్వ గుర్తింపు పొంది, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి కూడా వచ్చిన ఒక జాతీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు చట్టపరమైన ప్రక్రియలను ఉల్లంఘించి ప్రవేశించడం అత్యంత ప్రమాదకర ధోరణి. ప్రభుత్వాలపై విమర్శలు చేయడం, నిరసనలు చేపట్టడం, ప్రజా సమస్యలపై ఉద్యమించడం రాజ్యాంగం కల్పించిన హక్కులు. విద్యార్థి ఉద్యమాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో కీలక పాత్ర పోషించాయి. అలాంటి ఉద్యమాలను కేసులతో అణచివేయాలని చూడడం చరిత్రను తిరస్కరించడమే. గత కొన్నేళ్లుగా విమర్శించే ప్రతి వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందనే విమర్శలు పెరుగుతున్నాయి. రైతుల ఉద్యమం, కార్మిక సంఘాల నిరసనలు, విద్యార్థుల ఆందోళనలు, జర్నలిస్టులపై కేసులు, సామాజిక కార్యకర్తల అరెస్టులు-ఈ పరిణామాలన్నీ విభిన్న అభిప్రాయాలను అణచివేసే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలపై కూడా అదే విధానాన్ని అమలు చేయడం ఆందోళన కలిగించే విషయం.








