హైదరాబాద్, 2026-06-05
డిప్లొమా స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, జేఎన్టీయూహెచ్ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ ఎరవెల్లి జగన్ జన్మదిన వేడుకలు బుధవారం హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేశారు.
డిప్లొమా స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, జేఎన్టీయూహెచ్ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ ఎరవెల్లి జగన్ జన్మదిన వేడుకలు బుధవారం యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. విద్యార్థి లోకం, వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు, పాత్రికేయుల సమక్షంలో ఈ వేడుకలు అత్యంత కోలాహలంగా సాగాయి.
పర్యావరణ పరిరక్షణ సందేశం
జన్మదినాన్ని పురస్కరించుకుని జేఎన్టీయూహెచ్ లైబ్రరీ ఆవరణలో ఎరవెల్లి జగన్ మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీలో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రతి ఏటా తన పుట్టినరోజున మొక్క నాటడాన్ని ఒక ఆనవాయితీగా మార్చుకున్నానని తెలిపారు. సమాజంలో పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం నింపేందుకే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అభినందనలు
కార్యక్రమంలో పాల్గొన్న పీపుల్స్ న్యూస్, ప్రజా వీక్షణం దినపత్రికల ఎండీ శ్రావణ్ కుమార్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్‌లు జగన్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. చిన్నతనం నుంచే ఎదురైన సవాళ్లను ధైర్యంగా అధిగమించి, నేడు విద్యార్థి నాయకుడిగా ఎదిగిన జగన్ ప్రయాణం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఆయన చూపిస్తున్న చొరవ భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
వివిధ వర్గాల హాజరు
ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ అధికారులతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆల్ యూనివర్సిటీ నాన్-టీచింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ నియోజకవర్గాల ప్రెస్ క్లబ్ బాధ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇతర జిల్లాల్లోనూ వేడుకలు
హైదరాబాద్‌లోనే కాకుండా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ వంటి పలు జిల్లాల్లో డీఎస్ఎఫ్, స్టూడెంట్ జేఏసీ నాయకులు, జగన్ అభిమానులు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. స్థానికంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.












