తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు.
కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జరుగుతున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయ దినోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తక పఠనం, పుస్తక ప్రదర్శన, డిజిటల్ లైబ్రరీ, ఉత్తమ రీడర్ ఎంపిక వంటి కార్యక్రమాలను నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ జి. తుకారాం మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచారం సులభంగా లభిస్తున్నప్పటికీ, నిజమైన, లోతైన జ్ఞానం పుస్తకాల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. సెల్ఫోన్ల ద్వారా లభించే సమాచారం తాత్కాలికమని, అయితే పుస్తకాలు అందించే జ్ఞానం, ఆలోచనలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
గ్రంథాలయాన్ని జ్ఞాన భాండాగారంగా అభివర్ణిస్తూ, విద్యార్థులు ప్రతిరోజూ పుస్తక పఠనానికి సమయం కేటాయించాలని ప్రిన్సిపాల్ విద్యార్థులకు సూచించారు. ఇది వారి విద్యాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్, రమ్య, శ్రీధర్, గజేందర్, కేశం ముత్యం, కుంటాల ముత్యం, సిలారి ముత్యం, చిరంజీవి, రాకేష్, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.








