తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో గణనీయమైన మార్పులు రానున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్న ఈ కొత్త విధానం ప్రకారం, ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే ప్రాక్టికల్ పరీక్షలు, ఇంటర్నల్ అసెస్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
విద్యాశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటర్ ఫస్టియర్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. రెండవ సంవత్సరంలో కూడా ఇదే విధానం కొనసాగుతుంది.
గణితం (మ్యాథ్స్) విభాగంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్నల్ అసెస్మెంట్కు 15 మార్కులు కేటాయించబడతాయి. ఇది విద్యార్థుల నిరంతర అభ్యసనకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
ఫైనల్ పరీక్షల మార్కుల విధానంలోనూ మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం 100 మార్కులకు నిర్వహిస్తున్న పరీక్షలను 80 మార్కులకు కుదించనున్నారు. మ్యాథ్స్‌లో 75కు బదులుగా 60 మార్కులకు ఫైనల్ పరీక్ష ఉంటుంది. భాషా విభాగాల్లో 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారానే లభిస్తాయి.
ఈ మార్పుల ద్వారా విద్యార్థులు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా, సబ్జెక్టులను లోతుగా అర్థం చేసుకునేలా శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంస్కరణలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి.












