బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిపాలనా యంత్రాంగం, విశ్వవిద్యాలయంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన, పరీక్షలు, ఇతర కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కొంతమంది విద్యార్థులు (టి.ఎస్.ఎ.ఎస్. సభ్యులు) వీసీ కార్యాలయం వద్ద వేచి ఉన్నట్లుగా చిత్రీకరించిన వీడియోను మీడియాకు విడుదల చేయడం దురదృష్టకరమని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్యలు విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని వారు ఆరోపించారు.
విద్యార్థులు తమ సమస్యలను విన్నవించుకోవడానికి సరైన, అధికారిక మార్గాలను అనుసరించాలని విశ్వవిద్యాలయం సూచించింది. ఏవైనా సమస్యలు తలెత్తితే, విద్యార్థులు నేరుగా తమ విభాగాధిపతులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరింది.
అసత్య వార్తలను నమ్మవద్దని, తొందరపాటుతో సోషల్ మీడియాలో ఎలాంటి ప్రసారాలు చేయకూడదని యాజమాన్యం విద్యార్థులను, ప్రజలను విజ్ఞప్తి చేసింది. విశ్వవిద్యాలయం శాంతి, క్రమశిక్షణ కాపాడటంలో దృఢంగా ఉందని, విద్యార్థులు, స్థానికులు పరిపాలన విధానాన్ని గౌరవించాలని కోరింది.


