ఇక డ్రామాల్లేవ్.. జోగి రమేష్ అరెస్ట్!
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఉదయం అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ తో పాటు ఆయన పీఏను కూడా అరెస్టు చేశారు.
వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిని బద్నాం చేయడానికి అద్దేపల్లి జనార్దన్ రావు సోదరుల్ని పావులుగా వాడి పెద్ద కుట్ర చేశారు. కడప జిల్లాలో బయటపడిన నకిలీ మద్యం ఫ్యాక్టరీకి.. ఇబ్రహీంపట్నంలో డంప్ ఉందని ఆయన గుర్తించి హడావుడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అద్దేపల్లి జనార్దన్ రావును ఆఫ్రికా పంపించి.. నకిలీ మద్యం స్కామ్ డ్రామాలు ప్రారంభించారు.
అయితే పోలీసులు తీగ లాగడంతో అసలు విషయం బయటపడింది. తనను బలిపశువును చేయడంతో అద్దేపల్లి జనార్ధన రావు మొత్తం విషయం బయట పెట్టారు. జోగి రమేషే కుట్రదారు అని తేల్చారు. ఇటివల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మొత్తం వివరాలు రాబట్టారు. సాక్ష్యాలను కూడా సేకరించారు. అద్దేపల్లి ఎవరో తనకు తెలియదని.. జోగి రమేష్ బుకాయించారు. కానీ ఆయన బాగా పరిచయస్తుడని అన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
నకిలీ మద్యం కేసులో దొరికిపోవడంతో.. జోగి రమేష్ డ్రామాలు ప్రారంభించారు. వైసీపీ అనుకూల మీడియాలో కూర్చుని సవాళ్లు చేయడం ప్రారంభించారు. తర్వాత గుడిలో ప్రమాణం డ్రామా ఆడారు. నిన్నటికి నిన్న కేసును సీబీఐకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అవేమీ ఆయనను అరెస్టు నుంచి తప్పించలేకపోయాయి.
అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా వ్యవహరించారు జోగి రమేష్. బూతులు తిట్టడంలో తనదైన ముద్ర వేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. ఇప్పుడు విపక్షంలోకి వెళ్లాం ప్రభుత్వంపై నకిలీ మద్యం కుట్ర చేశారు. ఇతర కేసుల్లో ఆయనను అరెస్టు చేయడానికి వెనుకాడరు కానీ.. నకిలీ మద్యం కేసులో మాత్రం జైలుకు పంపుతున్నారు.