ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
*తానూర్ మనోరంజని ప్రతినిధి జూలై 31*
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం తానూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పలు విభాగాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ విభాగాలు, స్టోర్, ఇంజక్షన్ రూమ్, మందుల గదులను కలెక్టర్ పరిశీలించారు. వైద్యులను, సిబ్బందిని వివిధ అంశాలపై ప్రశ్నించి పలు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలింతలు, గర్భిణీలకు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య సేవలు అందించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయాలు అందుబాటులో ఉండేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ మహేందర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.