ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఆగస్టు 04
ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో బేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధులు నియంత్రించేందుకు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేయాలని అన్నారు. జిల్లాలో ఇప్పటికే మూడుసార్లు జ్వర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. పెంబి మండలానికి జాతీయస్థాయిలోనే ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో కాంస్య పతకం రావడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అధికారుల సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని అన్నారు. పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ జాతీయస్థాయిలో మంచి స్థానంలో నిలవడం లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కృషి గర్వించదగ్గదని అన్నారు. గవర్నర్ చేతుల మీదుగా కాంస్య పతకాన్ని స్వీకరించినందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ లను జిల్లా అధికారుల సంఘం తరపున సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు పెద్ద ఎత్తున అవయవదానానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖ రిటైర్డ్ ఉద్యోగి జొన్న వినోద్ కుమార్ దంపతులు మరణానంతరం వారి దేహాలను నిర్మల్ వైద్య కళాశాలకు విద్యార్థుల శిక్షణ కొరకు దానం చేయనున్నట్లు తెలిపారు. తన దేహాన్ని మరణానంతరం దానం చేయడం ఎంతో గొప్ప విషయం అని తెలిపారు. దీని ద్వారా వైద్య కళాశాల విద్యార్థులకు శిక్షణ, శాస్త్రీయ పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అవయవ దానానికి ముందుకు రావాలని అన్నారు. అవయవదానంతో ఎంతోమంది జీవితాలలో మరణానంతరం కూడా వెలుగును నింపవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా దేహాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన వినోద్ కుమార్ దంపతులను కలెక్టర్ అభినందించారు. ఇంతకుముందే వారి కుటుంబం నుంచి శరీరాలను పలు వైద్య కళాశాలలకు దానం చేసినందుకు వారిని ప్రశంసించారు. ఆయనను అదనపు కలెక్టర్ల తో కలిసి పింఛనర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ సన్మానించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు