నూతన రేషన్ కార్డులతో పేదలకు ఆర్థికాభివృద్ధికి దోహదం:*
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – ప్రభుత్వం అందజేస్తున్న నూతన రేషన్ కార్డులు పేద ప్రజలకు ఆర్థికంగా ఎదగడానికి సహకరిస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
బుధవారం దస్తురాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేషన్ కార్డు అనేది అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రామాణిక గుర్తింపు అని అన్నారు. నూతన కార్డుల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణ మాఫీ, పింఛన్లు, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాల నుంచి పేదలు లబ్ది పొందవచ్చని తెలిపారు. దస్తురాబాద్ మండలానికి 1352 నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని, కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చినట్లు పేర్కొన్నారు. గతంలో వివాహితులు, పుట్టినపిల్లలకు కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇకపై ఎవరికైనా రేషన్ కార్డు అవసరమైతే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మంజూరైన కార్డులను ఇంటి వరకు అధికారులే చేర్చుతారని తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని, ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రేషన్ కార్డుల ద్వారా పేదలు ప్రభుత్వ పథకాలు పొందుతూ గౌరవప్రదంగా జీవించగలరని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, సి పి ఓ జీవరత్నం, మండల ప్రత్యేక అధికారి నాగవర్ధన్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, తహసీల్దార్ విశ్వంబర్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు