వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 28
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం నిర్మల్ గ్రామీణ మండలం అనంతపెట్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన టెంట్, తదితర సౌకర్యాలను పరిశీలించారు. తప్పనిసరిగా సరిపడినన్ని గన్ని సంచులు, టార్పాలిన్లు, తేమ యంత్రాలు, తూకపు యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న సామాగ్రికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రైతులకు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. సరిపడినంత మంది సిబ్బంది ప్రతిరోజూ కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల వివరాలు, మద్దతు ధర, టోల్ ఫ్రీ నంబర్, తదితర వివరాలు రైతులకు తెలిసేలా బ్యానర్లను ప్రదర్శించాలని చెప్పారు. రైతులతో ప్రతి రైతు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి మాత్రమే అమ్మాలని సూచించారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులను నమ్మి మోసపోవద్దని చెప్పారు. తప్పనిసరిగా తమ ధాన్యాన్ని శుభ్రపరచిన తర్వాతనే ధాన్యాన్ని అమ్ముకోవాలని తెలిపారు. దీని ద్వారా రైతులకు అధిక ధర లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసిల్దార్ ప్రభాకర్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.