- విద్యాసంస్థల్లో రాజ్యాంగ పీఠికను ప్రతిరోజూ చదివే విధానానికి డిమాండ్
- లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు పంపించిన నాయకులు
- జాతీయ పండుగల్లో రాజ్యాంగ గ్రంథాన్ని ప్రదర్శించాలని విజ్ఞప్తి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గణేష్ మహరాజ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో భాగంగా లేఖలు పంపించారు. విద్యాసంస్థల్లో ప్రతిరోజూ ప్రార్థనలో భాగంగా భారత రాజ్యాంగ పీఠికను చదివించాలని, జాతీయ పండుగల్లో రాజ్యాంగ గ్రంథాన్ని ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్, జనవరి 22, 2025:
విద్యాసంస్థలలో ప్రతిరోజూ భారత రాజ్యాంగ పీఠికను చదివే విధానాన్ని అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహరాజ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో భాగంగా లేఖలు పంపారు.
ఈ సందర్భంగా గణేష్ మహరాజ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ఆధారస్థంభమని, విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాల ప్రార్థనలో రాజ్యాంగ పీఠికను చదవడం ద్వారా రాజ్యాంగ విలువలను గ్రహించే అవకాశం కల్పించాలన్నారు. రిపబ్లిక్ డే రోజున ప్రతి జాతీయ పండుగ సందర్భంలో రాజ్యాంగ గ్రంథాన్ని, డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికార JAC సంయుక్తంగా పాల్గొన్నాయి. జిల్లా ఇన్చార్జ్ లక్ష్మణ్, ఆదిల్లు, సుష్మ, వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ, ఇప్పటి వరకు అగ్రకుల పాలకులు రాజ్యాంగ విలువలను సమాజానికి దూరంగా ఉంచారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టకపోతే దశలవారీ ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.