మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
యాదాద్రి క్షేత్ర పరిరక్షణ బాధ్యత భక్తులందరిపై ఉందని, చిన్న పని కూడా నరసింహుని సేవతో సమానమని యాదాద్రి భక్తురాలు శ్రీమతి మంజుల పత్తిపాటి అన్నారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.
యాదాద్రి యశోదీపం, యుగయుగాల వెలుగై భక్తుల హృదయాల్లో భాసిల్లే దివ్య నిలయమని, యాదాద్రి పరిరక్షణ కోసం చేసే చిన్న పని కూడా నరసింహుని పాదసేవలో అర్పించిన పుష్పమేనని శ్రీమతి మంజుల పత్తిపాటి అన్నారు.
"గోవిందా... నరసింహా..." అంటూ గుండెల నిండా మొక్కుతూ గర్భగుడి దర్శనానంతరం గుడి నేలను చెత్తతో నింపుతున్నామని, కొబ్బరికాయ కొట్టి కోరికలు తీర్చమని వేడుకుంటూ ప్లాస్టిక్ చెత్తతో పవిత్ర ప్రాంగణాన్ని కలుషితం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
దేవుడికి పూలదండ వేయడం భక్తికి ఒక గుర్తు అయితే, దేవుడి ఇంటి ఆవరణాన్ని శుభ్రంగా ఉంచడం భక్తికి పరమార్థమని, పర్యావరణ పరిరక్షణే పరమపూజ అని పలుకుదామని ఆమె పిలుపునిచ్చారు.
పచ్చని ప్రకృతినే పరమప్రసాదమని భావించి, యాదాద్రిని దర్శించడమే కాదు, యాదాద్రిని రక్షిద్దామని ఆమె సూచించారు. మన చేతులతో చెత్త తొలగించి సేవాభక్తిని చాటుకుందామని, ప్లాస్టిక్కు వీడ్కోలు పలికి పచ్చదనానికి స్వాగతం పలుకుదామని, ప్రతి మొక్కను నాటి భవిత తరాలకు వరమై నిలుద్దామని తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో ప్రతి ప్లాస్టిక్ సంచి, ప్లాస్టిక్ బాటిల్ మనకు శాపమని గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.
శుభ్రమైన ప్రతి అడుగు శ్రీనరసింహునికి పుష్పార్చనేనని, పచ్చదనంతో నిండిన ప్రతి ప్రాంగణం పరమాత్మకు హారతియేనని ఆమె పేర్కొన్నారు. యాదాద్రి మహిమను కీర్తిస్తూ ప్రకృతిని కాపాడుదామని, భక్తి, శక్తి, శుభ్రతలతో స్వామివారి ఆశీస్సులు పొందుదామని ఆమె పిలుపునిచ్చారు.
ఈ రచనను శ్రీమతి మంజుల పత్తిపాటి, యాదాద్రి భక్తురాలు, చరవాణి 9347042218 అందించారు.











