పెద్దపల్లి, జూలై 25
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, మంథని గోదావరి నది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దపల్లి జిల్లా: తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ఘనంగా వేడుకలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమే స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు అర్చనలు చేశారు. విఠలేశ్వర స్వామి వారికి మహా పూజను వైభవంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ సమీపంలో గల గోదావరి నది తీరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యస్నానాల అనంతరం శ్రీ గౌతమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోదావరి నది తీరాన గల శ్రీ ఆంజనేయ స్వామి, గౌతమేశ్వర ఆలయంతో పాటు పట్టణంలోని ఇతర దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గోదావరి నది, ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రాకతో మంథని పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మంథని మున్సిపాలిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదావరి నదిని సందర్శించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. భక్తులకు ఆటంకాలు, అనవసర సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.











