తిరుపతి, 2026-08-19
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా వారాంతాల్లో కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. మంగళవారం ఒక్కరోజే రూ.6.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి మార్చి నెల నుంచి ఇప్పటి వరకు భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా వారాంతాల్లో కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలో శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దీ కనిపిస్తోంది. గత ఐదారు నెలలుగా రోజువారీ 60వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది.
రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
చాలాకాలం తర్వాత శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనం సమయాల్లోనే ఇంత భారీగా ఆదాయం వస్తుంది. ఈసారి మాత్రం సాధారణ రోజుల్లోనే భారీగా ఆదాయం రావడం విశేషం. మంగళవారం తిరుమల శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు.
నిన్నటి గణాంకాలు
33,539 మంది భక్తులు నిన్న స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీకి రూ.6.12 కోట్ల ఆదాయం సమకూరింది. మంగళవారం రోజు 4.16 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా, అన్నప్రసాదాలను 2.88 లక్షల మంది స్వీకరించారు. తిరుమలలో 3546 మంది భక్తులు వైద్య చికిత్స పొందారు.
భక్తుల రద్దీ కొనసాగింపు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని అంటున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోందని తెలుస్తోంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోందని అంచనా.












