చిత్తూరు, 2026-06-05
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు. పసి పిల్లల తల్లులు, తండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. శిశు దర్శనం పేరుతో కేవలం 40 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పసి పిల్లల తల్లీ దండ్రులకు శిశు దర్శనం పేరుతో కేవలం 40 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఎలాంటి రుసుము లేకుండా, ఆన్లైన్ బుకింగ్ టోకెన్లు లేకుండానే ఈ సౌకర్యం పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శిశు దర్శనం అర్హతలు
శిశు దర్శనానికి వెళ్లే దంపతులకు ఒక సంవత్సరంలోపు పిల్లలు ఉండాలి. చిన్నారితో పాటుగా తల్లీ తండ్రికి దర్శనానికి అనుమతిస్తారు. ఒకవేళ వారికి 12 ఏళ్ల లోపు పిల్లలుంటే వారికి కూడా అనుమతి ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6గంటల లోపు సుపథం మార్గం ద్వారా లోపలికి అనుమతిస్తారు.
అవసరమైన పత్రాలు
ఇందుకోసం సుపథం వద్దకు వెళ్లి శిశువు బర్త్ సర్టిఫికెట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జీ సమ్మరీ లెటర్ చూపిస్తే చాలు. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. టీటీడీ నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. దర్శనం 40 నిమిషాల్లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య సూచనలు
భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక సుపథం వద్దకు ఎంత త్వరగా చేరుకుంటే అంత మంచిది. శిశువుకు ఇబ్బంది కలగకుండా పాలు, డైపర్స్, మంచి నీళ్లు తీసుకొని వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. పూర్తి వివరాల కోసం టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్ 0877-2233333 కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు.











