హైదరాబాద్, జులై 25
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన రైల్వే స్టేషన్ ను రేపు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, అధికారులు పాల్గొననున్నారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం నిర్మించిన రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా రైల్వే స్టేషన్ ను ప్రారంభించనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం, మనోహరాబాద్–సిద్దిపేట కొత్త రైల్వే మార్గంలో మనోహరాబాద్–కొత్తపల్లి రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ నూతన రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.
సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్లో హై లెవెల్ ప్లాట్‌ఫారమ్, ప్లాట్‌ఫారమ్ షెల్టర్, ప్రయాణికుల వేచి ఉండే గది, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, ఇతర ప్రాథమిక వసతులను కల్పించారు. భక్తులు, ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఆధునిక ప్రమాణాలతో స్టేషన్‌ను నిర్మించారు.
ప్రస్తుతం సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య నాలుగు డెమూ రైళ్లు నడుస్తుండగా, వాటికి కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్లో అదనపు స్టాపేజీ కల్పించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులతో కలిసి సిద్దిపేట–సికింద్రాబాద్ డెమూ రైలు నంబర్ 77654 ను కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు.











