బాసర మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బీరప్ప స్వామి సహిత అక్క మహంకాళి కామరాతి దేవి, బోయిడి భోగన్న బయన్నల శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీరప్ప స్వామి ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.
నూతనంగా నిర్మించిన ఆలయంలో దేవీ నూతన విగ్రహ ప్రతిష్ఠ కోసం నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘనస్వాగతం పలికారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఊరేగింపులో బీరప్ప డోల్ల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. మహంకాళి దేవి సమేతంగా బీరప్ప స్వామి ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని కురుమ సంఘం ప్రతినిధి బాబు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల ప్రతినిధులు, వీడిసి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నూకం లింగారావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతోంది.


