నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాయకూర్ కాండ్లి గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండుగులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, దేవమ్మ ఆలయాల్లోకి చొరబడి సుమారు 50 తులాల వెండి, ఒక తులం బంగారు ఆభరణాలను అపహరించారు. అదే రాత్రి ఒక మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును కూడా దొంగిలించారు.
ఆలయాల్లో చోరీ జరిగినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోనేరు సాయన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు.
మరోవైపు, గ్రామానికి చెందిన కోనేరు నారాయణ కుటుంబానికి చెందిన మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా దుండుగులు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
సమాచారం అందుకున్న క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. దుండుగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వరుస చోరీలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.












