మథోల్ మండలంలోని బోరేగాం గ్రామంలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మృతుడిని ఎలగందుల శంకర్ (58)గా గుర్తించారు.
బోరేగాం గ్రామానికి చెందిన శంకర్, ఉదయం పశువులకు మేత వేయడానికి వెళ్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లారు. పశువుల పాక వద్దకు వెళ్లిన అతని చిన్న కుమారుడు, రేకుల షెడ్డులో శంకర్ ఉరివేసుకుని ఉండటాన్ని గమనించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కిందకు దించి, వైద్యుడికి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ఇటీవల భూమి, ఎడ్లను కొనుగోలు చేశారని, ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయని, దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
మృతుని పెద్ద కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు.
ఈ ఆత్మహత్య ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అప్పుల బాధతో జీవితాన్ని ముగించుకున్న శంకర్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.












