పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుడి దారుణ హత్య ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం అటవీ ప్రాంతంలో కుళ్ళిన స్థితిలో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే యువకుడి మృతదేహం మంథని మండలం గాడిదలగండి సమీపంలోని అటవీ ప్రాంతంలో కుళ్ళిన స్థితిలో ఆదివారం ఉదయం బయటపడింది. సుమారు పది రోజుల క్రితం వంశీ అదృశ్యం కాగా, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా వంశీ కాల్ డేటాను పరిశీలించగా, హైదరాబాద్కు చెందిన ఒక యువతితో అతనికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ యువతిని, ఆమె భర్తను విచారించగా, హత్యకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వంశీ గతంలో తన గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమాయణం నడిపినట్లు, అయితే ఆమె వేరొకరిని వివాహం చేసుకున్న తర్వాత వీరి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం.
ఇటీవల గ్రామ దేవతల కొలుపుల సందర్భంగా ఆ యువతి గ్రామానికి రావడంతో వంశీతో ఆమె ఫోన్ సంభాషణలు మళ్లీ మొదలైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న యువతి భర్త, తన భార్య ద్వారానే వంశీని హైదరాబాద్కు రప్పించి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. హత్య అనంతరం మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనతో సింగిరెడ్డిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












