ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక రవాణా ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితో నిర్వహించిన ప్రత్యేక కౌన్సెలింగ్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగిందని ఎస్పీ తెలిపారు. 2024లో ఇసుక ద్వారా రూ.35 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ.43 కోట్లకు, 2026లో ఇప్పటివరకు రూ.83 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 196 అక్రమ ఇసుక రవాణా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై తీవ్రంగా ఉందని, చట్టవ్యతిరేకంగా తరలింపునకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించడం, అధిక లోడ్‌తో వాహనాలు నడపడం, నకిలీ బిల్లులతో రవాణా చేయడం వంటివి నేరాలని, రాత్రి వేళల్లో జరిగే అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.
ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా గురించి తెలిసినవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అక్రమ ఇసుక రవాణా కేసుల్లో ఎలాంటి పైరవీలు, సిఫార్సులు పనిచేయవని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో సహజ వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే అక్రమ కార్యకలాపాలను ఉపేక్షించబోమని ఎస్పీ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖర్ రాజు, రూరల్ సీఐ పిఎన్డి ప్రసాద్, ఎస్ఐలు లక్ష్మయ్య, కృష్ణయ్య, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.












