మహబూబాబాద్, 2026-08-15
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్‌లో భారీ బంగారం గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్యాంకులో తాకట్టు పెట్టిన 22 మంది వినియోగదారులకు చెందిన సుమారు రూ.91 లక్షల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలను అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్ దొంగిలించినట్లు బ్యాంకు మేనేజర్ బాదావత్ మోతిలాల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో బ్యాంకు వద్ద ఉద్రిక్తత నెలకొంది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్‌లో భారీ బంగారం గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్యాంకులో తాకట్టు పెట్టిన 22 మంది వినియోగదారులకు చెందిన సుమారు రూ.91 లక్షల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలను అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్ దొంగిలించినట్లు బ్యాంకు మేనేజర్ బాదావత్ మోతిలాల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో బ్యాంకు వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు బాధితులు తమ బంగారం చూపాలని బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
వివరాల్లోకి వెళితే
పోలీసులు, బ్యాంకు అధికారుల కథనం ప్రకారం.. ఇండియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న భూక్య రాజేష్, బ్యాంకులో తాకట్టు పెట్టిన 22 మంది వినియోగదారులకు చెందిన 700 గ్రాముల బంగారు నగలను దొంగిలించారు. ఇందులో 16 మంది వినియోగదారులకు చెందిన బంగారు ఆభరణాలను మణపురం గోల్డ్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టగా, మిగిలిన ఆరుగురికి చెందిన బంగారు ఆభరణాల ప్యాకెట్లను ఆయన భార్య ఇంట్లో నుంచి తెచ్చి బ్యాంకులో అప్పగించినట్లు సమాచారం.
అసిస్టెంట్ మేనేజర్ నేపథ్యం
భూక్య రాజేష్ రెండు నెలల క్రితమే మానుకోట ఇండియన్ బ్యాంకు నుంచి మహబూబాబాద్ బ్రాంచ్‌కు అసిస్టెంట్ మేనేజర్‌గా బదిలీపై వచ్చారు. మరిపెడ బంగ్లా కేంద్రానికి చెందిన ఆయన, ఆరు సంవత్సరాల క్రితం ఇండియన్ బ్యాంక్‌లో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరి, అంచెలంచెలుగా ఎదుగుతూ అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. గతంలో ఆయన కర్నాటకలోని హుబ్లీ బ్యాంకు నుంచి మానుకోటకు బదిలీపై వచ్చారని తెలిసింది.
ఆడిట్లో బయటపడిన మోసం
బ్యాంకు ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. మహబూబాబాద్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాదావత్ మోతిలాల్ ప్రతి నెలా చివరన ఆడిట్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో బ్యాంకులోని నగదు, బంగారు ఆభరణాల సంచులను సరిచూసుకుంటుండగా, వినియోగదారులకు చెందిన బంగారు ఆభరణాల సంచుల్లో తేడా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని జోనల్ మేనేజర్, చీఫ్ మేనేజర్‌కు సమాచారం అందించారు.
తనిఖీలు, సెలవుపై వెళ్లిన నిందితుడు
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు గత వారం బ్యాంకుకు వచ్చి పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహించారు. ఆడిట్ జరుగుతుండగానే, గురు, శుక్రవారాల్లో భూక్య రాజేష్ సెలవుపై వెళ్లిపోయారు. శని, ఆది, సోమవారాలు కూడా సెలవులు ఉండటంతో, ఉన్నతాధికారులు బ్యాంకు మేనేజర్ మోతిలాల్‌ను భూక్య రాజేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. దీంతో మోతిలాల్ గురువారం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.











