మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన నాలుగేళ్ల మేనల్లుడికి యాసిడ్ తాగించి ప్రాణాపాయ స్థితికి నెట్టివేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. చాక్లెట్ ఆశ చూపి బాలుడికి యాసిడ్ తాగించినట్లు సమాచారం.
కుటుంబంలో నెలకొన్న విభేదాలు ఇంతటి అమానవీయ చర్యకు దారితీశాయని పోలీసులు తెలిపారు. తోడి కోడలి కుమారుడిని చిన్నచూపు చూస్తున్నారనే అక్కసుతో నిందితురాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలుడికి జ్యూస్ పేరుతో యాసిడ్ తాగించడంతో, కొద్దిసేపటికే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు బాలుడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితుడి తల్లి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు ఇలాంటి తీవ్ర పరిణామాలకు దారితీయడం స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.












