17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై పోక్సో (పోలీసు చట్టం) కేసు నమోదు చేయాలని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు.
మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టం ముందు అందరూ సమానులే అనే విధంగా పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. బండి సాయి భగీరథ తన తండ్రి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారనే అండతో విద్యాసంస్థల్లో ర్యాగింగ్, భౌతిక దాడులకు పాల్పడటం, మద్యం మత్తులో విద్యార్థులపై ఆరాచకాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపారు.
బాలికపై లైంగిక దాడి చేయడమే కాకుండా, తమను హనీ ట్రాప్ చేశారని, కేసులను తప్పుదోవ పట్టించడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో తనకు మద్యం తాగించి, ఇబ్బందులకు గురి చేశారని, ఈ విషయంపై తల్లితో కలిసి బెట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే, పోలీసులు గంటల తరబడి నిరీక్షింపజేసి ఫిర్యాదు స్వీకరించారని బాధితురాలు తెలిపినట్లు గోవింద్ నాయక్ పేర్కొన్నారు.
తక్షణమే బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సాయి భగీరథపై పోక్సో కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 'బేటీ బచావో, బేటీ పడావో' వంటి నినాదాలు ఇచ్చే బీజేపీ, రేపిస్టులకు సత్కారాలు చేయడం, లైంగిక దాడులకు పాల్పడటంతో మహిళల పట్ల వారి చిత్తశుద్ధిని చాటుకుంటున్నారని ఆయన విమర్శించారు.
కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు, పోలీసులను ప్రభావితం చేయడమే కాకుండా, బాధితురాలి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ యువతికి ప్రాణహాని పొంచి ఉందని, తక్షణమే సాయి భగీరథను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.











