బౌరంపేటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నిరంతరం ఏడుస్తున్నాడని రెండు నెలల పసికందును తల్లి అత్యంత కిరాతకంగా పొయ్యిలో విసిరి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లోని బౌరంపేటలో నివసిస్తున్న రాజేంద్ర ఆదివాసి, మమత అహిర్వార్ దంపతులకు రెండు నెలల బాబు ఉన్నాడు. సోమవారం రాత్రి బాబు నిరంతరం ఏడుస్తుండటంతో తల్లి మమత తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఏడుపు ఆపడానికి బాబు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి, ఆపై మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది.
పని ముగించుకుని వచ్చిన తండ్రి రాజేంద్ర, బాబు కనిపించకపోవడంతో భార్యను ప్రశ్నించాడు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతకగా, పొయ్యిలో కాలిపోయిన స్థితిలో బాబు మృతదేహం కనిపించింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు.
దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలైన తల్లి మమతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ నేపథ్యం, తల్లి మానసిక స్థితి వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.


