ఆదిలాబాద్, ఆగస్టు 05
సరైన పత్రాలు లేని 250 వాహనాలను, అక్రమ మద్యం బాటిళ్లను ఆదిలాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని, నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.
వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేకుండా నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో బుధవారం తెల్లవారుజామున 'కమ్యూనిటీ కాంటాక్ట్' కార్యక్రమం నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా, సరైన పత్రాలు లేని 250 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మూడు బెల్టు షాపుల నుంచి మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని, నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు.
మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఎస్పీ సూచించారు. ఒకవేళ మైనర్లు వాహనాలు నడిపే సమయంలో పోలీసులకు చిక్కితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై తిరిగేవారిపై కేసులు నమోదు చేస్తామని, ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. పాత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు అన్ని వివరాలు సరిచూసుకోవాలని, భద్రత కోసం ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.












