బీఆర్ఎస్ దోచుకుంటే.. మిగిలింది కాంగ్రెస్ దోచుకుంటోంది
సంగారెడ్డి: జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ నేతృత్వంలో ఆందోల్ మండలం సంగుపేట వద్ద ఓ ఫంక్షన్ హాల్లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత చంటి ప్రభుతోపాటు చంటి దేవిక బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడారు..
రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రామచందర్ రావు కోరారు. వర్షాలతో పంట నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వెయ్యలేదని ఆరోపించారు. రైతులను ఆదుకోలేదని విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమలు కానీ హామీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమైందని తెలిపారు. ప్రకృతి వనాలు, స్మశానవాటికలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రామచందర్ రావు ఆరోపించారు. గత పది సంవత్సరాల్లో ఉన్నదంతా బీఆర్ఎస్ దోచుకుంటే మిగిలింది ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీసీల సంక్షేమాన్ని చూడడం లేదని మండిపడ్డారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించింది ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పుకొచ్చారు. బిల్లులు రాక బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తీరు కొనసాగుతోందని విమర్శించారు. ఏ హక్కుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఓటు అడుగుతున్నారో ప్రజలకు చెప్పాలని బీజేపీ చీఫ్ రామచందర్ రావు ధ్వజమెత్తారు