జమ్మలమడుగు ఆర్టీపీపీ ప్రాంతానికి చెందిన లక్షుమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతిచెందారు. ఆమెకు బంధువులు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు స్పందించి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వమే మహోన్నత మతమని మరోసారి చాటారు.
స్థానికుల సమాచారం అందగానే ఫౌండేషన్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర వెంటనే స్పందించారు. తన సభ్యులతో కలిసి శనివారం హిందూ శ్మశానవాటికలో లక్షుమ్మకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, ఈశ్వర్ వర్ధన్ రెడ్డి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయాలనుకునే దాతలు 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు.











