మెండోరా మండలంలోని వివిధ గ్రామాల్లో క్రైస్తవ భక్తులు ఆదివారం ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించారు.
మెండోరా మండలంలోని దూదిగాం, సోంపేట, మెండోరా, పోచంపాడు, ముక్కాల్, కిసాన్ నగర్ గ్రామాల్లోని క్రైస్తవులు ఈ పండుగను సంబరంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే విశ్వాసులు దేవాలయాలకు చేరుకుని సిలువ వెలిగించి ప్రార్థనలు చేశారు. భక్తిగీతాలతో యేసుక్రీస్తుని ఆరాధించారు.
దూదిగాం సిఎస్ఐ దేవాలయంలో మహిళలు ర్యాలీగా సిలువ వద్దకు చేరుకుని క్యాండిల్స్ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పాస్టర్ రెవ. ఎం. ప్రసాద్, ఎద మినిస్ట్రీ వ్యవస్థాపకులు బ్రదర్ శ్రీనివాస చారి, హెప్సిబా చారి పాల్గొని ఈస్టర్ ప్రాముఖ్యతను వివరించారు.
యేసుక్రీస్తు పునరుత్థానం మరణంపై విజయం సాధించినట్లు, మానవాళి పాప విమోచనకు ఆయన చేసిన త్యాగం గొప్పదని బైబిల్ అధ్యాయాల ద్వారా వివరించారు. 'దైవ కుమారుడికి మరణం లేదు' అనే విశ్వాసాన్ని చాటే పవిత్ర దినమే ఈస్టర్ అని తెలిపారు. ప్రత్యేక భక్తి గీతాలతో ఆరాధనలు కొనసాగాయి.
హాస్టల్ విద్యార్థులు, బాలబాలికలు నృత్య ప్రదర్శనలతో భక్తులను అలరించారు. దూదిగాం గ్రామానికి చెందిన అక్కపత్రి లేయా డేవిడ్ కుటుంబ సభ్యులు భక్తులకు ఉదయకాలంలో అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, యువకులు, వృద్ధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












