మెండోరా మండలంలోని దూదిగాం నెహ్రునగర్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోచంపాడు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత ధనరాజ్, ఉపసర్పంచ్ మొహమ్మద్ షరీఫ్, గ్రామ సెక్రటరీ శ్రీనివాస్ లు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత ధనరాజ్ మాట్లాడుతూ, అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల ఆరాధ్యుడని, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆమె పిలుపునిచ్చారు. జయంతి వేడుకల్లో భాగంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
వేడుకల్లో భాగంగా గ్రామంలో భారీ ర్యాలీని నిర్వహించారు. గ్రామం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం మీద వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కే. శ్రీనివాస్, అప్పారావు, శశికుమార్, రాహుల్, దావూద్, పాపారావు, మాజీ సర్పంచ్ గైక్వాడ్ మహేందర్, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












