ఆడపిల్ల ఇంటికి నవ్వుతూ వస్తుందని, కానీ ఆమె వెనుక నిశ్శబ్దంగా ఏడ్చిన వేల కథలుంటాయని, వాటిని వినే మనసుంటేనే అర్థమవుతుందని కవయిత్రి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి పేర్కొన్నారు. ఆడది కేవలం ఆటబొమ్మ కాదని, ఆమె హృదయం ప్రేమ కోసం కొట్టుకునే జీవమని ఆమె అన్నారు.
తన కలలను మౌనంగా త్యాగం చేసి, ఇంటికి వెలుగునిచ్చే స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకునే మనసుంటేనే ఆమె విలువ తెలుస్తుందని పత్తిపాటి తెలిపారు. ప్రేమతో పెంచిన కూతురిని పెళ్లి అనే మాటతో అత్తారింటికి పంపేటప్పుడు తండ్రి గుండె చీలిపోతుందని, ఆమె షోరూంలో కొనుక్కున్న వస్తువు కాదని, మనసున్న ప్రాణమని ఆమె అన్నారు. బొమ్మలతో ఆడుకున్న చిన్న చేతులు ఇంటి పనుల భారాన్ని మోస్తున్నప్పుడు, నవ్వు వెనుక దాచిన కన్నీటిని ఎవరు గమనిస్తారని ఆమె ప్రశ్నించారు.
తన ఇంటి పేరును వదిలి అత్తింట్లో గౌరవంగా మారే కూతురిని, కొడుకులా కాకుండా కేవలం కోడలిగా చూసే ధోరణిని ఆమె విమర్శించారు. కూతురి భవిష్యత్తు కోసం తల్లిపడే నిద్రలేని రాత్రులు, కూతురిని అత్తారింటికి పంపే రోజున తండ్రి గుండెలోని నిశ్శబ్ద వేదనను సమాజం గ్రహించాలని ఆమె కోరారు.
ప్రేమతో పెంచిన కూతురిని కన్నీటి హారంగా పంపే సంప్రదాయం, సమాజ కట్టుబాట్లతో ఆమెను బలి ఇచ్చే ఆచారం ఎందుకని ఆమె ప్రశ్నించారు. తండ్రి వేళ్లను పట్టుకొని నడిచిన అడుగులు ఒంటరిగా ఎందుకు నడవాలని, పుట్టింట్లో కూతురైన ఆమె అత్తింట్లో కేవలం కోడలిగా ఎందుకు మిగిలిపోవాలని ఆమె అన్నారు.
సమాజంలోని కుళ్ళును తొలగించి, నవ సమాజ నిర్మాణానికి నాంది పలకాలని మంజుల పత్తిపాటి పిలుపునిచ్చారు. ఈ సందేశం ద్వారా స్త్రీల పట్ల సమాజ దృక్పథాన్ని మార్చుకోవాలని ఆమె ఆకాంక్షించారు.












