ప్రపంచ ఛాంపియన్ పవర్ లిఫ్టర్ మోడెం వంశీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
భద్రాచలం ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు మోడెం వంశీ పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి, భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇటీవల మాల్టాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఆయన, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ విజయాలతో భారత్‌కు కీర్తి తెచ్చిన మోడెం వంశీ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన సాధించిన పతకాలను సీఎం గారికి చూపించగా, ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
“ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని నిరూపిస్తూ, రోజుకూలీ ఇంట్లో పుట్టినా పట్టుదలతో ప్రపంచ విజేతగా నిలిచిన వంశీ, తెలంగాణ గర్వకారణం, భారత కీర్తి ప్రతీక” అని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.