వెనిజులాపై అమెరికా దురాక్రమణను వెంటనే నిలిపివేయాలి : సీఐటీయూ

వెనిజులాపై అమెరికా దురాక్రమణను వెంటనే నిలిపివేయాలి : సీఐటీయూ

కీసర: జనవరి 06 మనోరంజని తెలుగు టైమ్స్

వెనిజులాపై అమెరికా చేపడుతున్న దురాక్రమణ చర్యలను వెంటనే నిలిపివేయాలని సీఐటీయూ కీసర మండల కమిటీ డిమాండ్ చేసింది. అమెరికా దురాక్రమణను నిరసిస్తూ సీఐటీయూ కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప కాలనీ నుంచి 2BHK ఫేస్–2 వరకు ర్యాలీ నిర్వహించినట్లు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం వెనిజులాపై చేస్తున్న దురాక్రమణను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత కొన్ని వారాలుగా అమెరికా వెనిజులా చుట్టూ తన సైనిక, నావికా దళాలను మోహరించి బలవంతంగా అక్కడ ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 2025 డిసెంబర్‌ తొలి వారంలో అమెరికా ప్రకటించిన జాతీయ భద్రతా వ్యూహం వెనుక ఉన్న వాస్తవ ముఖచిత్రం ఇదేనని వ్యాఖ్యానించారు.పశ్చిమార్థగోళంలో అమెరికా సైన్యాన్ని మోహరించడం ద్వారా మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యాన్ని ట్రంప్‌ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటిస్తోందని, ఇది జేమ్స్‌ మన్రో సిద్ధాంతాన్ని అనుసరించడమేనని పేర్కొన్నారు. కరేబియన్‌ జలాల్లో మోహరించిన అమెరికా సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, వెనిజులాపై సాగిస్తున్న దురాక్రమణ దాడులను తక్షణమే నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. లాటిన్‌ అమెరికాను శాంతి జోన్‌గా ప్రకటించాలని, సార్వభౌమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది. వెనిజులా అధ్యక్షుడు ముదురో భార్యను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ, ముదురో దంపతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కోరింది.
అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యుఎన్ఎస్‌సి) తీర్మానం ప్రవేశపెట్టాలని, వెనిజులాపై దాడులను నిలిపివేసేలా అమెరికాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కీసర మండల నాయకులు చింతకింది అశోక్‌తో పాటు ఎస్‌.ప్రభాకర్, కుమార్, రాజేష్, భాస్కర్, అనురాధ, స్వరూప, లక్ష్మి, సంపావతి, పవిత్ర, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment