గుస్సాడి దండారి వేడుకలో పాల్గొన్న రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్
మన సంస్కృతి – మన గౌరవం; దాన్ని కాపాడటం మన అందరి బాధ్యత — డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ
మనోరంజని తెలుగు టైమ్స్ లింగాపూర్ ప్రతినిధి – అక్టోబర్ 22
లింగాపూర్ మండలంలోని ఎల్లాపటార్ గోండుగూడా గ్రామంలో వైభవంగా నిర్వహించిన గుస్సాడి దండారి ఉత్సవంలో రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలాని పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, గుస్సాడి బృంద సభ్యులు మరియు స్థానిక ప్రజలతో కలిసి సాంప్రదాయ పూజా కార్యక్రమాల్లో పాల్గొని, గుస్సాడి కళాకారులను ప్రోత్సహించారు.
చైర్మన్ జిలానీ మాట్లాడుతూ, “గుస్సాడి దండారి పండుగ మన గిరిజన సమాజపు ఆత్మగౌరవానికి ప్రతీక. మన ఆదివాసి సమాజపు సంస్కృతి ఒక కళ కాదు, మన పూర్వీకుల ధైర్యం, విశ్వాసం, ఐకమత్యం ప్రతిబింబం. ఈ సంప్రదాయాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అన్నారు.
అలాగే యువత ఈ సాంప్రదాయ కళలను నేర్చుకొని ముందుకు తీసుకెళ్లాలని, ఆధునికతతో పాటు మన మూలాలను సజీవంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. “సమాజం బలపడేది మన సంస్కృతి నిలిచినప్పుడే” అని చైర్మన్ జిలాని అన్నారు.
రెహమాన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం, సాంస్కృతిక పరిరక్షణ, ఐకమత్యం కోసం అంకితభావంతో కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గుస్సాడి బృంద సభ్యులు, రెహమాన్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యనిర్వాహకులు మహమ్మద్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, చప్డే మారుతి, షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.