నిర్మల్, ఆగస్టు 4
ఉద్యోగం లభించలేదనే నిరాశను అధిగమించి, స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని విజయం సాధిస్తున్నాడు నిర్మల్ జిల్లాకు చెందిన ఏలముల సాయికుమార్. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో, పట్టుదల కోల్పోకుండా ఏదైనా సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాడు.

ఆధునిక కాలంలో నిత్యవసరంగా మారిన మోదుగ ఆకు ఇస్తరాకులు, పేపర్ ప్లేట్ల తయారీ వ్యాపారాన్ని ఎంచుకున్న సాయికుమార్, నిర్మల్ పట్టణంలో చిన్న స్థాయిలో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. మయూరి హోటల్ వెనుక 'సాయి పేపర్ ప్లేట్ కంపెనీ' పేరుతో స్థాపించిన ఈ సంస్థ, తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.
నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించడం ద్వారా మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు సాయికుమార్. ప్రస్తుతం తన వ్యాపారం ద్వారా పది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాడు.
“ఏ వ్యాపారమైనా మనసుపెట్టి, కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలి” అని సాయికుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సాయికుమార్ కృషిని ఆయన మిత్రులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఆయన ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు పేర్కొన్నారు.