రాష్ట్ర బంద్ కు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన
కేటీఆర్ కు విజ్ఞాపన పత్రం అందజేసిన బిసి జేఏసీ నేతలు
హాజరైన చైర్మన్ ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని, కో చైర్మన్ రాజారామ్ యాదవ్
మనోరంజని తెలుగు టైమ్స్ హైదరాబాద్ సిటీ బ్యూరో అక్టోబర్ 15
ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలను నయవంచన చేస్తుందని ఆయన ఆరోపించారు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు అయితే కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే చిత్తశుద్ధి లేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర బంద్ కు వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్న బీసీ జేఏసీ నేతలు, మంగళవారం ఉదయం టిఆర్ఎస్ పార్టీ మద్దతు కోరారు అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ సాధన కోసమే బందుకు పిలుపునిచ్చామని ఏ పార్టీకి ఏ వర్గానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. దశాబ్దాలుగా తీవ్రమైన అన్యాయానికి గురైతున్న బీసీలుగా తమకు రావలసిన న్యాయమైన వాటా కోసం బందుకు పిలుపునిచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని సవరించడము ఒకటే ఏకైక మార్గమని దానికోసం ఇటు రాష్ట్రము అటు కేంద్రము జోక్యం చేసుకొని రాజ్యాంగపరమైన రక్షణలు బీసీలకు కల్పించాల్సిన అవసరం ఉందని రాజారామ్ యాదవ్ అన్నారు. న్యాయమైన ఈ డిమాండ్ ను సాధించేందుకు కులాలు, సంఘాలు, పార్టీలకతీతంగా ఏకం కావలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో చైర్మన్ రాజారామ్, బీసీ జేఏసీ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జనరల్ సెక్రెటరీ మేకల కృష్ణ, వివిధ కుల సంఘాలు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.