పెంబి బ్లాక్‌కు జాతీయస్థాయిలో కాంస్య పతకం.
గవర్నర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నీతి అయోగ్ ప్రతిపాదిత ఆస్పిరేషన్ బ్లాకులలో కీలకంగా నిలిచిన నిర్మల్ జిల్లా పెంబి బ్లాక్‌కు కాంస్య పతకం లభించింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
నీతి అయోగ్ ఎంపిక చేసిన 500 ఆస్పిరేషన్ బ్లాకులలో పెంబి బ్లాక్ నాల్గవ స్థానంలో నిలిచింది. ఆరోగ్య, పోషణ, వ్యవసాయం, విద్య, మౌలిక సదుపాయాలు తదితర ఆరు సూచికలలో మెరుగైన పనితీరును ప్రదర్శించినందుకే ఈ పురస్కారం లభించిందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, పెంబి బ్లాక్‌కు జాతీయస్థాయిలో నాల్గవ ర్యాంకు రావడం గర్వకారణం. ఇది సమిష్టి కృషికి నిదర్శనం. ఆస్పిరేషన్ నుంచి ఇన్స్పిరేషన్‌గా మారిన పెంబి మనందరికీ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. సంపూర్ణత అభియాన్ లో భాగంగా గర్భిణీ స్త్రీల నమోదు, డయాబెటిస్ స్క్రీనింగ్, సప్లిమెంటరీ పోషకాహారం అందజేతలో వందశాతం పనితీరు, భూ హెల్త్ కార్డుల జారీలో 70 శాతం, మహిళా సంఘాల రుణాల పంపిణీలో 94 శాతం పురోగతిని పెంబి బ్లాక్ సాధించిందని కలెక్టర్ వివరించారు