బ్రిడ్జి నిర్మాణం కలేనా?
సమయం గడిచినా పూర్తికాని పనులు… అవస్థల్లో ప్రజలు
మనోరంజని తెలుగు టైమ్స్ రుద్రూరు / బోధన్ (నిజాంబాద్ జిల్లా) ప్రతినిధి
నిజాంబాద్ జిల్లా రుద్రూరు మండలం రాయకూరు గ్రామం నుంచి బోధన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రాయకూరు–బోధన్ మార్గమధ్యంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి పనులు కాలపరిమితి ముగిసినా ఇంకా అర్ధాంతరంగానే నిలిచిపోయాయి.
2023లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రూ.3 కోట్లు 1 లక్ష 50 వేల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం 2025 మార్చి నెలలోగా పనులు పూర్తవ్వాల్సి ఉండగా, గడువు ముగిసినా ఇప్పటికీ నిర్మాణం ముందుకు సాగకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
బ్రిడ్జి పనులు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంతం మొత్తం జలమయమై రహదారి మూసుకుపోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో బోధన్‌కు వెళ్లే ప్రజలు పొడవైన మార్గాలు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
గ్రామాలకు దూరమవుతున్న బోధన్
ఈ బ్రిడ్జి పూర్తయితే సులేమన్ ఫారం, దోమలేడి, ఎతొండ తదితర గ్రామాల ప్రజలకు బోధన్ పట్టణం చాలా సమీపంగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ బ్రిడ్జి పనులు కలగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల విజ్ఞప్తి
ఇప్పటికైనా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించి, సంబంధిత అధికారులతో చర్చించి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
లేకపోతే రానున్న రోజుల్లో ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.