వైభవంగా స్వాత్మ రామాలయ బ్రహ్మోత్సవాలు
క్షీరంలో చంద్ర దర్శనానికి భక్తుల సందడి
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి 05
సారంగాపూర్: మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వాత్మ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో, భక్తి పారవశ్యంతో ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని, జిల్లా కేంద్రంలోని బత్తీస్గడ్ ఖిల్లాపై వాకులాభరణం కేశవనాథ్, ఆదినాథ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిపి, కీర్తనలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం ఐదు రోజులపాటు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా, కోజగిరి పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి విశిష్టంగా “పాలలో చంద్ర దర్శన” కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడుతున్నాయి.
ఇతర ఉత్సవాల్లో భాగంగా, ఆలయంలో రోజువారీగా భజనలు, కీర్తనలు అర్చకులు, భక్తులతో కలిసి ఘనంగా నిర్వహించబడుతున్నాయి. జిల్లాలో ప్రధాన దేవాలయంగా ఖ్యాతి గాంచిన ఈ ఆలయంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం మహా అన్నదానం జరగనుండగా, వేలాది మంది భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు.