బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి
ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ గోవింద్ నాయక్ బాణావత్
మనోరంజని, తెలుగు టైమ్స్ ఖానాపూర్ ప్రతినిధి | అక్టోబర్ 14
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్. ఒక ప్రకటనలో మాట్లాడుతూ, కేంద్రం ఎవరు అడగకముందే ఓసీలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, పార్లమెంటు, రాజ్యసభ ద్వారా ఆమోదింపజేసి, వారం పది రోజుల్లో అమలులోకి తీసుకురావడం మోడీ ప్రభుత్వ వేగాన్ని చూపుతోందని పేర్కొన్నారు. అదే సమయంలో, తెలంగాణ రాష్ట్రం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. “బీసీలకు చెందిన మోడీ నిజంగా బీసీల పక్షపాతి అయితే, ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా అమలు చేయించాల్సింది,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈడబ్ల్యూఎస్ బిల్లును అగ్రకుల ఓసీల కోసం వేగంగా పాస్ చేస్తే, బీసీల బిల్లును ఎందుకు ఆలస్యం చేస్తారో తెలియదని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వమే గవర్నర్ ద్వారా బిల్లును అడ్డుకుంటోందని, రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ చర్యపై బాధ్యత తీసుకొని వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేకపోతే, బీసీ రిజర్వేషన్ 42% గా ప్రకటించేందుకు కేంద్రాన్ని ఒప్పించేలా ప్రయత్నించాలి, లేదంటే బీసీ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. “తెలంగాణలో బీజేపీ లేకుండా చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు అవకాశం ఉండదని ఇప్పుడు స్పష్టమవుతోంది” అని గోవింద్ నాయక్ పేర్కొన్నారు.