వాల్మీకి మహర్షి మందిర నిర్మాణానికి భూమి పూజ
మనోరంజని తెలుగు టైమ్స్ ఖానాపూర్ ప్రతినిధి – అక్టోబర్ 16, 2025
ఖానాపూర్‌లోని కొమురం భీమ్ చౌరస్తా పంచముఖి హనుమాన్ క్షేత్రంలో గురువారం రామాయణ రచయిత వాల్మీకి మహర్షి మందిర నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ అధ్యక్షుడు ఆకుల నారాయణ ప్రధాన పూజారి చేతులతో పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆకుల నారాయణ మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం సత్యం, ధర్మం, నీతి, న్యాయం వంటి విలువలను ప్రతీ మనిషికి బోధించే గ్రంథమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో నిర్మించబడుతున్న ఈ ఆలయం వాల్మీకి సమాజానికి ఆధ్యాత్మిక ప్రేరణగా, సామాజిక ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందన్నారు.
సంఘ ఉపాధ్యక్షుడు నర్రా చంద్రయ్య మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి ఆశీస్సులతో ఆలయం నిర్మాణం విజయవంతంగా పూర్తవ్వాలని ఆకాంక్షించారు. వాల్మీకి కుల సభ్యులందరూ కలసి, సహకారంతో ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల వాల్మీకి కుల సంఘ సభ్యులు, హిందూ బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.