భూకబ్జాకు గురవుతున్న భీమన్న గుట్ట ప్రాంతం
– భూ కబ్జాదారుల నుండి భూమిని కాపాడాలంటూ అడిషనల్ కలెక్టర్కు వినతి
– జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ముదిరాజ్ కులస్తులు ఆందోళన
మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17:
నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య నగర్ సమీపంలో గల ముదిరాజ్ కులస్తులకు చెందిన భీమనగుట్ట ప్రాంతాన్ని కొందరు కబ్జా చేస్తున్నారు. శుక్రవారం రోజు భీమన్నగుట్ట ప్రాంతంలోని కొన్ని ఎకరాల భూమిని ప్రోక్లిన్ సహాయంతో చదును చేయడం గమనించిన ముదిరాజ్ కులస్తులు దానిని అడ్డుకున్నారు. ఈ విషయమై ముదిరాజులకు కేటాయించిన భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ) కిషోర్ కుమార్ కు ముదిరాజ్ కులస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ గతంలో హైకోర్టు ఉత్తర్వుల ద్వారా తమ కులస్తులకు ప్రభుత్వం భూమిని కేటాయించడం జరిగిందని ముదిరాజ్ సంఘ సభ్యులు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి ముదిరాజులకు జీవనోపాధి కల్పిస్తున్న, భీమన్నగుట్ట ప్రాంతాన్ని కబ్జాకు గురికాకుండా చూడాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను కోరారు. గతంలో కూడా కొన్ని ఎకరాల భూమిని కొందరు కబ్జాకు గురిచేశారని, ఈ విషయంపై అధికారులకు తెలియజేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు భీమనగుట్ట ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా చూడాలని వేడుకున్నారు. లేనియెడల జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ముదిరాజ్ కులస్తులు అధికారులకు హెచ్చరించారు.