- ఇంటింటి సర్వే నివేదిక ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు.
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీ వర్గాలకు నష్టమనే అభ్యంతరాలు.
- బహిరంగ విచారణ ద్వారా ఇప్పటివరకు 1224 వినతులు స్వీకరణ.
- బీసీ జాబితాలోనుండి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలని విజ్ఞప్తి.
తెలంగాణలో బీసీ కులాల పునర్వ్యవస్థీకరణ కోసం బీసీ కమిషన్ పరిశీలన కొనసాగుతోంది. సర్వే నివేదిక ఆధారంగా ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ఇప్పటివరకు 1224 వినతులు అందగా, 26 కులాలను బీసీ జాబితాలో చేరుస్తూ కోరుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై బీసీ వర్గాల అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బీసీ కులాల పునర్వ్యవస్థీకరణపై తీవ్రంగా పరిశీలిస్తోంది. బీసీ ఏ, బీ, సీ, డీ, ఈ వర్గాల్లోని కులాలను పునర్వ్యవస్థీకరించాలన్న కుల సంఘాల విజ్ఞప్తులను కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వివరించారు. ఇంటింటి సర్వే నివేదిక అందిన తర్వాత ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా బీసీ వర్గాలకు నష్టం జరుగుతోందని అనేక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఖైరతాబాద్ కమిషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజలు, కుల సంఘాల ప్రతినిధుల నుంచి దాదాపు 58 వినతులు అందాయి. మొత్తం 1224 వినతులు స్వీకరించామని, ఇందులో బీసీ జాబితాలో తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలని కోరినట్లు తెలిపారు.
మంగళవారం కూడా బహిరంగ విచారణ కొనసాగుతుందని, ఆసక్తి గలవారు తమ వినతులను సమర్పించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.