:బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ… అనిల్ దారితప్పాడు..!!

:బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ… అనిల్ దారితప్పాడు..!!

:బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ… అనిల్ దారితప్పాడు..!!

బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ అండ్ ఫైనల్లీ హాస్యాన్ని అన్నీ సమపాళ్లలో రంగరిస్తేనే పండుతుంది. అందులోనూ క్రైమ్ స్టోరీలో కామెడీని జొప్పించాలంటే చాలా టాలెంట్ ఉండాలి. లేకపోతే కాఫీలో ఐస్ క్రీం కలుపుకుని తాగినట్టు ఉంటుంది…

గతంలో అనిల్ రావిపూడి తీసిన F2 చూశా, అందులో ప్రతి పాత్రా ఒక్కో మేనరిజమ్స్ తో నడుస్తుంది, కథ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నడుస్తుంది, అన్నిటికన్నా ముఖ్యం హాస్యాన్ని సమపాళ్లలో రంగరించాడు… అంచేత చాలామందికి కనెక్ట్ అయ్యింది…

అదే ఊపులో ఆవేశపడి F3 తీశాడు. ఆ ఆవేశంలో కామెడీ తాలూకు తూకాన్ని సరిగా వాడలేదు. ఓవర్ కామెడీ ఎప్పుడూ జనాలు భరించలేరు. దాంతో తుస్ అయ్యింది…ఆ అనుభవంతో పాఠం నేర్చుకుని సంక్రాంతికి వస్తున్నాం తీసాడేమో అని వెళ్తే నిరాశే ఎదురైంది… ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథ ఏమీ లేదు… అయినా పర్లేదు…

సునిశిత హాస్యంతో చక్కటి కథనం నడిపిస్తాడు అనుకుంటే ప్రతి పాత్ర చేతా అరిపించాడు… సినిమా మొదలే కెజీఎఫ్ లెవెల్లో హీరో ఎలివేషన్లు ఇస్తే ఇదేంటి కామెడీ మూవీ అని చెప్పి యాక్షన్ మూవీ తీసాడు అని ఆశ్చర్యపోతాం…అయితే ఈ మూవీ పూర్తిగా కామెడీ జానర్ లో ఉంటుంది అని ముందు నుంచి ఎలివేషన్లు ఇచ్చారు కాబట్టి క్రైమ్ స్టోరీ కాస్త రూట్ మార్చుకుని కామెడీ ట్రాక్ లోకి వచ్చింది. ప్రేక్షకుడిని ఎలాగైనా సరే నవ్వించాలనే సింగిల్ పాయింట్ ఫార్ములాతో కంకణం కట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మిగతా లాజిక్కులన్నీ గాల్లో వదిలేశాడు…

అదేదో సినిమాలో బొమ్మ వేసి కింద దాని పేరు కూడా రాయమంటాడు… అలా ఈ సినిమాలో నరేష్ ని వెనక జాతీయ జెండా బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి సీఎం సీఎం అని పదిసార్లు చెప్పించడంతో మనం నరేష్ సీఎం అని నమ్మాలి… అంత జోకర్ లా చేశారు సీఎం క్యారక్టర్ ని…

ఈ సినిమాలో నరేష్ తెలంగాణా సీఎం కాబట్టి ఒండ్రు మండ్రు అంటూ ఒకట్రెండు వాక్యాలు తెలంగాణా యాసలో మాట్లాడించారు… అదేంటో తను తెలంగాణా సీఎం అని నరేష్ కి గుర్తొచ్చినప్పుడల్లా తెలంగాణా యాసలో మాట్లాడుతాడు… మిగతా అంతా మామూలు భాషే…

సీఎం ఏంటీ గ్యాంగ్ యెత్తుకుపోయిన బిజినెస్ మేన్ ఆకెళ్ళ గురించి కనిపించిన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటీ అనే లాజిక్కులు వెతకకండి.. ఖరుసైపోతారు. కామెడీలో ఇదీ ఒక భాగం అనుకుని ప్రేక్షకులు పెద్దమనసు చేసుకోవాలి…

నరేష్ పక్కన వీటీవీ గణేష్ అని ఒక తమిళ నటుడ్ని పెట్టారు, కానీ ఒకటే డైలాగ్ ను సినిమా అంతా ఆయనతో పలికించి సరిగా వాడుకోలేదు…

ఇక వెంకటేష్ F2 లో పలికించినంత హావభావాలు ఇందులో ప్రదర్శించలేకపోయాడు కానీ బానే చేశాడు… వెంకటేష్ కొడుకు రూపంలో ఓ బాల ఉగ్రవాదిని పెట్టి బూతులు పలికించారు.. ఇది నా బూతే నా భవిష్యతి లెవెల్. ఇది కూడా కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించింది…

గోదారి గట్టు పాట బావుంది కానీ కామెడీ కోసం దాన్ని కూడా ఖూనీ చేసేశారు… ఈ పాటను చక్కగా ఏ కోనసీమ అందాల మధ్య తీసుంటే ఇంకా బావుండేది. హీరో హీరోయిన్లు ఇళ్ళ మీద గెంతుతూ కింద పడుకున్న వాళ్ళమీద పెంకులు పడేలా పాడటంతో చక్కటి ఫీల్ పోయింది…

ఈ పాట అయిపోగానే ఊళ్ళో జనం వెంకటేష్ మామయ్య ఇంటికి వచ్చి మీ అల్లుడు అమ్మాయి తెల్లవార్లూ గోదారి గట్టు పాట పాడుతూ మా మీద పెంకులు వేసారంటూ అదే పాట పాడుతూ అభినయించడం మితిమీరిన కామెడీకి పరాకాష్ట…

వెంకటేష్ భార్యగా వేసిన ఐశ్వర్య రాజేష్ డబ్బింగ్ ఎవరిచేత చెప్పించారో కానీ గోదారి యాసలో బాగుంది… ఇక రెండో హీరోయిన్ కు కర్తవ్యం విజయశాంతి టైపులో ఎలివేషన్ ఇచ్చారు .. అయినా పర్లేదు.. బానే చేసింది…

జైలర్ పాత్రలో ఓ నటుడి చేత దర్శకుడు అరివీర భయంకర కామెడీ చేయిద్దామనుకున్నాడు కానీ అరుపులు కేకలతో అదో పెద్ద ప్రహసనంగా మారింది… ఆ జైలర్ అండ్ సాయి కుమార్ ల మధ్య సన్నివేశాలు చూస్తే అదేదో సినిమాలో బట్టల సత్యం.. కోట శ్రీనివాస్ ల మధ్య నడిచిన పోలీస్ స్టేషన్ సన్నివేశాలు గుర్తొస్తాయి…

ఇక విలన్ చనిపోతే వెంకటేష్ అండ్ టీమ్ వీల్ చైర్లో అతగాడి డెడ్ బాడీని తీసుకెళ్తూ ప్రేక్షకులను కామెడీ చేద్దామనుకునే ప్రయత్నం చూస్తే బావగారూ బాగున్నారా సినిమాలో వీల్ చైర్లో డెడ్ బాడీ అవతారంతో బ్రహ్మానందం చేసిన కామెడీ సీన్లు గుర్తుకొస్తాయి…

అది కామెడీ, ఇది క్యా మెడీ …. చక్కగా సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ పెట్టినందుకైనా , హీరోయిన్ చేత గోదావరి యాసలో మాట్లడించినందుకైనా , చక్కటి గోదావరి జిల్లా గ్రామీణ లోకేషన్లలో షూటింగు చేసినా అదో శాటిస్ఫాక్షన్ ఉండేది…

సినిమాలో ఎక్కడా గ్రామీణ వాతావరణం కనిపించదు… ఇక గోదావరి జిల్లాల్లో కనిపించే కోడి పందాలు, పిండి వంటలు లాంటి సంక్రాంతి సంబరాలు ఈ సినిమాలో హుళక్కి, ఆ సన్నివేశాలు టచ్ చెయ్యలేదు…

ఇక్కడ రాజమండ్రిలో ఓ ఇంటి సెట్టింగు, అక్కడ హైదరాబాద్లో సీఎం ఇంటి సెట్టింగుతో సింపుల్ గా నడిచిపోయింది… అందుకే కాబోలు పెద్దగా ఖర్చు లేకుండా మూడు నెలల్లో సినిమా తీసి వదిలారు…

ఇంత క్రైమూ కామెడీ చూపించినప్పుడు ఏదో సందేశం కూడా ఇస్తే పీడా పోతుంది అనుకున్నాడేమో దర్శకుడు చివర్లో ఓ మాష్టారుని కూడా కథలో ఇరికించేసాడు… ఈ మాస్టారి సన్నివేశాలు కథలో భాగంగా రావు, ఎక్కడిదో ఓ రీలు ముక్క ఇందులో అతికించినట్టు ఉంటుంది… మళ్లీ ప్రేక్షకులు పెద్దమనసు చేసుకోవాలి…

ఏతావాతా ఈ సినిమా జబర్దస్త్ కి ఎక్కువ F3 కి తక్కువలా ఉంది… ఈ సినిమా గురించి నేను రాసిన రివ్యూ కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే… అందరికీ నచ్చకూడదు అనే రూలు ఏమీ లేదు … కనుక పెద్ద మనసు చేసుకొండి… సంక్రాంతికి విడుదలైన మూడు తెలుగు చిత్రాలలో మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నిలిచిందని చెప్పొచ్చు

Join WhatsApp

Join Now

Leave a Comment