బండి సంజయ్ అవుట్ – కిషన్ రెడ్డి ఇన్ !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారంలో హఠాత్తుగా బండి సంజయ్ సైడ్ తీసుకున్నారు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డి వచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి రోజంతా ఉండి ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. మొదట్లో బండి సంజయే లీడ్ తీసుకున్నారు. ఆయన మజ్లిస్ .. కాంగ్రెస్ కు లింక్ పెట్టేసి తనదైన మార్క్ రాజకీయాలు చేయడంతో బీజేపీ పుంజుకుంటుందేమో అన్న అనుమానం చాలా మందికి వచ్చింది. కానీ అలాంటి అవకాశానికే తాము వ్యతిరేకం అని బీజేపీ హైకమాండ్ ఆయనను దూకుడు తగ్గించి ప్రచారానికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
బండి సంజయ్ దూకుడు తగ్గించేసిన పెద్దలు
బండి సంజయ్ బీజేపీ మార్క్ రాజకీయాల్లో దిట్ట. ముస్లింల ఓట్లు నిర్ణయాత్మకం అయిన జూబ్లిహిల్స్ లో ఆయన అడుగు పెట్టి లీడ్ తీసుకుంటే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే ఆయన మజ్లిస్ ను టార్గెట్ చేసిన వైనం చూసి రాజకీయ వర్గాలు షాక్ కు గురయ్యాయి. ఆ తర్వాత కూడా ఆయన అదే ధోరణి కొనసాగించారు. ముస్లిం మైనార్టీలపై బండి సంజయ్ వ్యాఖ్యలు హేట్ స్పీచ్ లాగానే ఉంటాయి. కానీ అదే బీజేపీకి బలం. మరో వర్గం మొత్తం ఆయన వెనుక వస్తుంది. జూబ్లిహిల్స్ లోనూ అదే మ్యాజిక్ చేసేందకు బండి సంజయ్ రెడీ అయిన సమయంలో హఠాత్తుగా సైలెంట్ అయ్యారు.
మళ్లీ రంగంలోకి కిషన్ రెడ్డి
బండి సంజయ్ ను హఠాత్తుగా రేసు నుంచి తప్పించిన బీజేపీ హైకమాండ్.. మళ్లీ కిషన్ రెడ్డిని రంగంలోకి దింపింది. ఆయన రోజూ ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రచారం జరుగుతుందో లేదో ఎవరికీ తెలియనంత గుంభనంగా ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి ఇచ్చే పొలిటికల్ స్టేట్మెంట్లు ఎవరికీ పట్టవు. పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అందుకే బీజేపీ ప్రచారంలో చప్పుడు చేయడం లేదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. బండి సంజయ్ ను హడావుడిగా పక్కన పెట్టి మళ్లీ కిషన్ రెడ్డిని ఎందుకు రంగంలోకి తెచ్చారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇదే చేశారు. బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డిని పెట్టడంతోనే మొత్తం సీన్ మారిపోయింది. ఇప్పుడు జూబ్లిహిల్స్ ఉఎన్నికల్లోనూ అదే్ చేస్తున్నారు.
బీజేపీని ఎందుకు నియంత్రిస్తున్నారు?
బండి సంజయ్ తరహా దూకుడు ఇప్పుడే వద్దని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారని అనుకోవచ్చు. లేదా బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం ప్రకారం..బీజేపీని నార్మల్ గానే ఉంచాలని అనుకుంటున్నారని అనుకోవచ్చు. కానీ అది బీజేపీకి నష్టం చేయడమే అవుతుంది. బండి సంజయ్ ను ఎందుకు నియంత్రిస్తున్నారో కానీ..ఆయనను పట్టి ఉంచడం వల్ల బీజేపీనే ఎదగడం లేదని నేతలు మథన పడుతున్నారు. వివాదాస్పద అంశాలతోనే పార్టీని బలపర్చడంలో బండి సంజయ్ ది ప్రత్యేక పాత్ర. ఎప్పటికప్పుడు ఆయన లాక్కెళ్తూంటే.. స్పాయిలర్ లాగా కిషన్ రెడ్డిని పంపుతోంది హైకమాండ్. బండి సంజయ్ కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది.